నేడు సోషల్ మీడియా డే..✍
(సామాన్యుడి చేతికి అందిన ఆయుధం)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
★ సోషల్ మీడియా.. సమీప చరిత్రలో ఓ సంచలనం. ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన మాధ్యమం. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన మాధ్యమం.
■ ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాదే రోజువారి జీవితంలో కీలక సాధనంగా మారింది. సమాచార మార్పిడి మొదలై భావప్రకటన స్వేచ్ఛకు ఆయుధంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం నిత్యజీవితంలో ఎంత ప్రభావ వంతంగా ఉందో చర్చించేందుకు జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
■ జాస్మిన్ విప్లవం.. గడిచిన దశాబ్ధంలో ప్రపంచ పటంలో సంభవించిన పెనుమార్పు పేరు. ఒక్క ఫేస్‌బుక్ పోస్ట్ ఈజిప్టులో అధికార మార్పిడికి కారణమైంది. లక్షలాది మంది ప్రజల్ని వీధుల్లోకి నడిపించింది. లోలోన దాగిన నిరసన జ్వాలను పెల్లుబికే లావాలా మలిచిన ఘనత సోషల్ మీడియాది. మంచి- చెడు, ఆనందం- విషాదం, ఉద్యమం - ఉద్వేగం, కసి - కన్నీళ్లు అన్నింటికీ సోషల్ మీడియా వేదికవుతోంది. ప్రపంచ గమనంలో కీలకస్థానాన్ని కైవసం చేసుకుంటోంది.
☄సాంకేతిక విప్లవం..
◆ నిజానికి సాంకేతికరంగంలో సాధించిన ప్రగతికి సోషల్ మీడియా ఓ సజీవసాక్ష్యం. సమాచార మార్పిడికి ఉత్తరాలపై ఆధారపడిన కాలం నుంచి టెలిగ్రామ్, టెలిఫోన్, సెల్‌ఫోన్ ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే సమాచార మాధ్యమాల్లో రేడియో, టీవీ, పత్రికల స్థానాన్ని ఇంటర్నెట్ ఆక్రమించింది. ఇది ప్రపంచాన్ని డిజిటల్ యుగంగా మార్చిన దశ. ఇంటర్నెట్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చాయి. ఉత్తర ప్రత్యుత్తరాల స్థానంలో మొయిల్స్ వచ్చాయి. టెలిగ్రామ్‌ల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. క్రమంగా అది ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్ట్‌ఇన్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల వరకు విస్తరించింది. ఇవే ఇప్పుడు సమాచార మార్పిడిలో కీలకంగా మారాయి.
☄భావ ప్రకటన స్వేచ్ఛ..🗣
◆మ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కును ప్రజలు సోషల్ మీడియా ద్వారా నిలబెట్టుకుంటున్నారు.ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడుతున్న మాధ్యమం సోషల్ మీడియా. దాన్ని ఎంతమంది వినియోగించు కోగలుగుతున్నారనే ప్రశ్న ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు రాజ్యం జోక్యం చేసుకుంటున్నప్పటికీ ప్రజలు స్వేచ్చగా తమ అభిప్రాయాల్ని ప్రకటించగలుగుతున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకుంటున్నారు. సాంప్రదాయ వార్తపత్రికలు, ఛానళ్లు కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నా యన్న విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత దశలో సామాన్యుడు తన అభిప్రాయాల్ని వెల్లడించడానికి ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్,వాట్సప్ వంటి సామాజిక మాధ్యమా లను వేదికగా మార్చుకుంటున్నాడు.
☄సామాన్యుడి చేతి ఆయుధంలా..
■ వేగం సోషల్ మీడియా ప్రత్యేకత. ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచానికి తెలియజేసేందుకు సోషల్ మీడియా దోహదపడుతోంది. ఈ విషయంలో వార్త ప్రసార సాధనాలను వెనక్కినెట్టి మరీ సోషల్ మీడియా దూసుకుపోతోందనడంలో అతిశయోక్తిలేదు. అంతే.. రాజకీయ, సామాజిక విషయాలపై సామాన్యుడు సైతం తన అభిప్రాయాల్ని వెల్లడించేందుకు సోషల్ మీడియా మాధ్యమాలు వేదికగా నిలుస్తున్నాయి. అందుకే.. అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాలు సోషల్ మీడియా ద్వారా భావ ప్రచారం కొనసాగిస్తుండడం గమనించవచ్చు. తెలంగాణ వంటి ఉద్యమాలే అందుకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమంలో డిజిటల్ మీడియాది కీలక పాత్ర. ప్రతిఘాతుక శక్తుల కుయుక్తులను ఎప్పటికప్పడు ఎండగట్టడంలో సోషల్ మీడియా సహకారం చెప్పుకొదగింది. అంతేకాదు.. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఫేస్‌బుక్‌లో వేలాది గ్రూప్‌లు సృజనాత్మక ప్రక్రియల పురోగతి కోసం పనిచేస్తుండడం గమనించవచ్చు.
☄దుష్ప్రభావాలు సైతం..
■ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగముందో అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పిడి, భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే.. కొందరు దుర్వినియోగం చేస్తుండడం కూడా గమనించవచ్చు. వ్యక్తిగత దుష్ప్రచారం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం వంటివి ఇందులో భాగమే. సోషల్ మీడియా వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు సెక్సువల్ అబ్యూజ్‌కి గురైన సందర్భాలు లేకపోలేదు. సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో సైతం సంబంధాలు ఏర్పడడుతుండడంతో వాళ్లని నమ్మి మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉంటా రు. ఇలా సైబర్ క్రైం శాతం పెరిగింది కూడా కాదనలేని నిజం. ప్రభుత్వం, ఇంటర్నెట్ ప్రొవెడైర్స్, సామాజిక మాధ్యమ సంస్థలు ఉమ్మడిగా... ఆన్‌లైన్ మీడియాపై విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే.. సాంకేతిక ప్రగతికి అర్థం ఉంటుంది.
*☄సోషల్ మీడియా డే..
■ సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఉంది. వాటిని సక్రమంగా వినియోగిం చులేకపోతే ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే.. సోషల్ మీడియా సాధనాలు - నిత్య జీవితంలో ప్రభావాలపై అవగాహన కోసం 2010లో మాషబుల్ సోషల్ మీడియా డే ని ప్రారంభించింది. అలా మొదలైన సామాజిక మాధ్యమాల దినోత్సవం క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం మొదలైంది. అందులో భాగంగా 7వ సోషల్ మీడియాడేని నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నెటిజన్లు నిర్వహించుకుంటున్నారు.
★ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార గణం... ఇవన్నీ దేశం చక్కగ నడవటానికి మూల కారణాలు. అయితే, వీటికి ఎప్పుడూ తోడుగా వుంటూ వస్తోంది మీడియా.అలాంటి సామాజిక మాధ్యమంలో ఇప్పుడు ప్రజాస్వామ్యానికి సోషల్ మీడియా ఐదవ స్తంభంగా ఆవిర్భవిస్తోందంటే అతిశయోక్తి కాదు.